శివయ్యకే ..పంగనామాలు కాల్వబుగ్గ దేవస్థానం మాజీ ఈవో చేతివాటం. 2 m ago

featured-image

దేవుని మాన్యాలు, భూములను పరిరక్షించాల్సిన అధికారి.. నీతి మాలిన చర్యలకు ఏకంగా దేవుని సొమ్ముకే ఎసరు పెట్టాడు.. భక్తులు ఇచ్చిన కానుకలు, సొమ్ములతో పాటు దేవుని భూములపై వచ్చే మాన్యాలను అడ్డదారిలో మళ్ళించాడు. దేవదాయ శాఖ ఖాతాను కాదని తన సొంత బ్యాంకు ఖాతాకు తరలించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయలకు పైగా తరలించి కాల్వబుగ్గ ఆలయం కు చెందిన ఆ ముక్కోటికే పంగనామాలు పెట్టాడు. ఆ తర్వాత దర్జాగా ఆ సొమ్మును వినియోగించి తాను మరో దేవాలయం కు బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. అయితే కోట్ల రూపాయల సొమ్ము దారి మళ్ళిన వైనంపై ఆ శాఖ అధికార సిబ్బంది నోట.. బయటకు రాగా, అంతవరకు ఆదమరిచి నిద్రపోతున్న దేవదాయ శాఖ అధికారులకు ఒక్కసారిగా కళ్ళు బైర్లుక‌మ్మాయి.. ఇంకేముంది షరా మామూలే.. దారి మళ్లిన ఆలయ సొమ్ము పై విచారణ నిర్వహించగా విస్తు పోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈవిష‌యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ దేవస్థానానికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో సమర్పించిన నిధులను ఆలయ ఈఓ డీఆర్‌కేవి ప్రసాద్‌ హుసేనాపురం గ్రామీణ బ్యాంక్‌లో దేవస్థానం తరుపున వ్యక్తిగత ఖాతా సృష్టించి జమ చేశాడు. ఆ నిధుల్లో రూ.1.20 కోట్లను దశల వారీగా స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోమవారం దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి ఆలయానికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ భూములు, వివిధ వ్యాపారాలకు సంబంధించిన నిధులను మాజీ ఈఓ తన వ్యక్తిగత ఖాతాకు జమ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కంగుతిన్న అధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వంకు నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మాజీ ఈవో కు సంబంధించిన బ్యాంక్‌ ఖాతాలో లావాదేవీలను మంగళవారం పరిశీలించనున్నట్లు కర్నూలు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD